నగరంలో మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

SMTV Desk 2019-01-03 16:52:28  Hyderabad, chain snatching, Theifs, Hyderabad task force, Police, New delhi, Medchal

హైదరాబాద్, జనవరి 3: గత నెలలో నగరంలో 15 గంటల వ్యవధిలో ఏకంగా 9 చైన్ స్నాచింగ్ లకు పాల్పడి సంచలనం సృష్టించిన స్నాచర్స్ చివరికి పోలీసులకు న్యూ ఢిల్లీ లో దొరికిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి నెల కూడా పూర్తి కాకుండానే మళ్ళీ చైన్ దొంగలు వెలుగులోకి వచ్చారు. మేడ్చల్ జిల్లా కాప్రా ప్రాంతంలో వొంటరిగా రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కుని వెళ్లారు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాప్రా మండలం సైనిక్ పురి ప్రాంతంలో నివాసముండే ఓ మహిళకు పని ఉండటంతో బయటకు వచ్చింది. కాలనీ నిర్మానుష్యంగా ఉండటం మహిళ వొంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడాన్ని ఛైన్ స్నాచర్లు గమనించారు. దీన్ని అదునుగా భావించి మహిళ పక్కనుంచి వేగంగా బైక్ ను పోనిచ్చి మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.
దీంతో బాధిత మహిళ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన మెడలోని 7 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ జరిగిన కాలనీలోని సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గొలుసు దొంగల కోసం గాలింపు కూడా ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.