కేసీఆర్ పై ధ్వజమెత్తిన బీజీపీ సీనియర్ నాయకుడు

SMTV Desk 2018-12-27 15:03:47  KCR, TRS, BJP, Parliment election commission, Reseravations, Dr. K. Laxman

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఎన్నికల రిజర్వేషన్ల పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్ష్మన్‌ బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయన తెరాస సర్కార్ పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్‌ బీసీలకు వెన్నుపోటు పొడిచారని పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను గత 30 ఏళ్లుగా అమలవుతున్న 34% రిజర్వేషన్లను ఇప్పుడు ఏ ప్రతిపాదికన దాన్ని 22% కుదించారో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పాలని అలాగే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా విడుదల చేసిన రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ ఏ ప్రతిపాదికన విడుదల చేసిందో వివరించాలని ఆయన నిలదీశారు. 5ఏళ్లలో ఎలాంటి గణాంక వివరాలు లేకుండా బీసీ రిజర్వేషన్లను ఎలా తగ్గిస్తారని లక్ష్మన్‌ ప్రశ్నించారు.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామన్న కేసిఆర్‌ తన మాట మార్చారని విమర్శించారు. సిఎం కేసిఆర్‌ కేవలం బీసీలకు బర్రెలు, గొర్రెలు ఇవ్వడమే తప్ప చట్టసభల్లో అవకాశం కల్పించేది లేదా? అని ఆయన నిలదీశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడాన్ని ఖండిస్తూ బీసీల రిజర్వేషఫ్లు తగ్గిస్తూ విడదుల చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లక్ష్మన్‌ డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా లేకపోవడం వల్ల వందల గ్రామపంచాయతీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాధికారానికి బీసీలను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లలో న్యాయం జరిగేవరకు బిజెపి పోరాటం కొనసాగిస్తుందని, బీసీల పక్షాన నిలుస్తుందని లక్ష్మన్‌ స్పష్టం చేశారు.

టిఆర్‌ఎస్‌ గతంలో ఎస్సీలను, ఎస్టీలను, నేడు బీసీలను మోసం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీసీ జనాభా గణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందని అయినప్పటికీ బీసీలను అన్యాయం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు టిఆర్‌ఎస్‌ చేస్తున్న మోసం గమనించాలని లక్ష్మన్‌ కోరారు. బీసీ గణాంక వివరాలను సర్వే చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సిఎం కేసిఆర్‌ పాలన గాలికి వదిలి, ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ తిరుగుతున్నాడని, ఈ ఫ్రంట్‌లు టెంట్లు వారి కుటుంబం కొరకేనని లక్ష్మన్‌ విమర్శించారు. గతంలో ఇలాంటి ఫ్రంట్‌లన్నీ విఫలమయ్యాయని, కేసిఆర్‌ ప్రయత్నాలను నిష్పలమన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్‌ పక్షాన ఉన్న యుపిఏ మధ్య ఎన్నికలు జరుగుతాయని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావడం మోడీ ప్రధాని కావడం ఖాయమని లక్ష్మన్‌ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు బిజెపి ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రిపై దాడిని ఖండిస్తూ తాము గతంలో చెప్పినట్లు రజాకార్ల రాజ్యం వస్తుందని, ఈదాడి దానికి ప్రత్యక్ష నిదర్శనమని లక్ష్మన్‌ పేర్కొన్నారు.శాసనమండలి నాయకులు ఎన్‌. రాంచందర్‌రావు మాట్లాడుతూ 22 లక్షల ఓట్ల గల్లంతుపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కొరుతూ గురువారం బిజెపి రాష్ట్ర అద్యక్షులు డా.కె. లక్ష్మన్‌ నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలువనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. కుమార్‌, అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, మీడియా కమిటీ కన్వీనర్‌ సుధాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.