కేసీఆర్‌ నాటకాలను ప్రజలు గుర్తిస్తారు : సిపిఐ నేత

SMTV Desk 2018-12-27 12:40:47  TRS Party, CPI, Suravaram

హైదరాబాద్, డిసెంబర్ 27: సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం బుధవారం సిపిఐ 93 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ప్రలోభ పెట్టడంతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రస్తుతం దేశంలో ఉన్న అనైక్యత పరిస్థితులను విచ్చిన్నం చేయడం కోసమే తాము మూడో కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ పేరిట రోజుల తరబడి దేశావ్యాప్తంగా పర్యటనలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం తన బాస్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరణ ఇస్తారని వెల్లడించారు. థర్డ్‌ ఫ్రంట్‌ నిర్ణయం ఎప్పుడో జరిగిందన్న కేసీఆర్‌ నోట్ల రద్దు, జీఎస్‌టికి మద్దతు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

కేసీఆర్‌ నాటకాలను ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. కాగా ప్రస్తుత ప్రరిస్థితుల్లో తాము అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఆయన వివరించారు. వర్గ దోపిడీ, అసమానతలు ఉన్నంత వరకూ కమ్యూనిస్ట్‌లు ఉంటారన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో తాము ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రజా ఉద్యమాల్లో ఎందరినో అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. జల్లో ఉన్న వారి తరపున జవహర్‌లాల్‌ నెహ్రూ కేసులు వాదించారని వెల్లడించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర అమోఘమైనదని, దాన్ని ఎప్పటికీ మరువ లేనిదని ఆయన తెలియచేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది తమ పార్టీయేనన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల కమ్యూనిస్ట్‌ పార్టీలు బలహీనపడ్డాయని చెప్పారు.