కేటీఆర్ చేతికి టీఆర్ఎస్ పగ్గాలు…

SMTV Desk 2018-12-17 10:38:39  kcr,ktr,trs,

హైదరాబాద్ , డిసెంబర్ 17: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌… ఇవాళ ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉదయం 10.15 గంటలకు బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ దవాఖాన నుంచి తెలంగాణభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తొలుత తెలంగాణ భవన్‌లోని తెలంగాణతల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ కర్యక్రమానికి సుమారు 20 వేల మంది వరకు రావొచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రోడ్‌ నంబర్‌ 10 నుంచి వచ్చే వాహనాలను బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి మీదుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వైపు, రోడ్‌ నంబర్‌ 12 నుంచి వచ్చే వాహనాలను జర్నలిస్టు కాలనీ మీదుగా మళ్లిస్తున్నారు. తెలంగాణ భవన్‌కు వచ్చే రోడ్డును దాదాపు గంటన్నరపాటు మూసి వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమ నిర్వహణను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక కేటీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధంచేసుకొంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయాల సొంత భవనాల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.