ఇక ఎన్నికల ‘పంచాయతీ’

SMTV Desk 2018-12-16 12:22:59  Panchayat Elections, Gram Panchayat

హైదరాబాద్ , డిసెంబర్ 16: అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుపవలసి ఉన్నప్పటికీ, బీసీ ఓటర్ల జాబితాలు సిద్దం కాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ మూడు నెలలోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినందున జనవరి 10వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించవలసి ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్దం అవుతోందిప్పుడు.

ఇప్పటికే జిల్లాలు వారీగా బీసీ జనాభా గణన పూర్తికావస్తోంది కనుక జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించవలసి ఉంటుంది. ఇదే ప్రధాన అవరోధంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం-2018లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు కల్పించింది. ఆ ప్రకారం పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34 శాతం కోటాతో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60.19 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. కానీ అన్నివర్గాలకు కలిపి 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితమే తీర్పు చెప్పింది. కనుక బీసీలకు మళ్ళీ 23 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించవలసి వస్తోంది. కానీ పంచాయతీరాజ్‌ చట్టంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు కల్పించి ఇప్పుడు వెనక్కు తగ్గతామంటే బీసీ సంఘాలు వొప్పుకోమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని బీసీ సంఘాలు సూచిస్తున్నాయి. కనుక ముందుగా ఈ సమస్యను పరిష్కరిస్తేకానీ పంచాయతీ ఎన్నికల గంట మోగదు. కనుక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు తీసుకొంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటాను ప్రకటిస్తే వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టడానికి తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెపుతున్నారు. రెండు మూడు రోజులలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కనుక అతి త్వరలోనే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలవుతుంది.