రేవంత్‌రెడ్డి అరెస్ట్

SMTV Desk 2018-12-04 15:37:32  revanth reddy, congress,

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి రేవంత్‌రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం కొడంగల్‌లో నిర్వహించబోయే సిఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాదసభను అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునీయడంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటలకు పోలీసులు కొడంగల్‌లో ఆయన నివాసానికి చేరుకొని మెయిన్ గేట్ తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరులను, గన్ మెన్, వాచ్ మెన్లను కూడా అదుపులోకి తీసుకొన్నారు. పరిగి వద్ద వాచ్ మెన్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రేవంత్‌రెడ్డితో పాటు కొడంగల్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం. వారినందరినీ శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.

సిఎం సభను అడ్డుకొనేందుకు నేడు కొడంగల్‌ బంద్ కు పిలుపునిచ్చి రేవంత్‌రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనపై ఐపిసి సెక్షన్స్: 341, 188, 506, 511 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు రేవంత్‌రెడ్డి భార్య గీతకు తెలియజేశారు. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయనను ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.రేవంత్‌రెడ్డి అరెస్టుతో కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆయన ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులను మోహరించి పట్టణంలో కర్ఫ్యూ విదించారు.