కేసీఆర్‌ సోనియా గాంధీ ఉప్పు తిన్నారు: నరేంద్ర మోడీ

SMTV Desk 2018-11-27 16:11:14  KCR, Modi, congress, TRS

నిజామాబాద్‌ , నవంబర్ 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మొదటిసారిగా నిజామాబాద్‌ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఊహించినట్లుగానే సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “కేసీఆర్‌ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు అందుకే ఆయన ఎప్పుడూ యాగాలు చేస్తుంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటారు. కాంగ్రెస్‌ నేతలు ఆయనను విమర్శిస్తుంటారు. కానీ వారందరూ వొక్కటే. ఎందుకంటే, కేసీఆర్‌ కాంగ్రెస్‌ విద్యార్ధి. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కేంద్రమంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌ సోనియా గాంధీ ఉప్పు తిన్నారు కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారంటే ఎవరు నమ్ముతారు.

కర్ణాటక ఎన్నికలలో ఆయన ఏమి చేశారో అందరూ చూశారు కదా? అలాగే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్‌-తెరాసలు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయి. కేసీఆర్‌, కాంగ్రెస్‌ నేతలు పార్టీ పోటాపోటీ ఎన్నికలహామీలు ప్రకటిస్తున్నారు. తెరాస-కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పైకి కనిపిస్తున్నప్పటికీ రెండూ వొక్కటే. రెంటిలో కుటుంబపాలన కామన్.

గతంలో ఇచ్చిన హామీలనే అమలుచేయలేకపోయిన కేసీఆర్‌ మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. నిజానికి ఆయన హామీలనే కాదు పూర్తికాలం పరిపాలన కూడా చేయలేకపోయారు. ఇంటింటికీ త్రాగునీళ్లు ఇవ్వకపోతే ప్రజలను ఓట్లు అడగనని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ 9 నెలలు ముందుగానే మీ ముందుకు వచ్చి ఓట్లు ఆడుతున్నారు. హామీలు అమలుచేయలేని కేసీఆర్‌ను, అవినీతికి మారుపేరైన కాంగ్రెస్‌ పార్టీని ఇంటికి పంపించి బిజెపిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను,” అని అన్నారు.