కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలి : ఆర్.కృష్ణయ్య

SMTV Desk 2018-11-23 18:44:02  KCR, r krishnaiah, elections, congress

హైదరాబాద్, నవంబర్ 23: కాంగ్రెస్ నేత, బీసీ కులాల సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన ఆరోపణలు చేసారు. కేసీఆర్ వి ఓటు బ్యాంకు రాజకీయాలని... ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 4 వేలు ఇచ్చాడని అనుకోవద్దని... రాష్ట్రంలోని వొక్కొక్క తలపై లక్ష రూపాయలు అప్పు తెచ్చాడని విమర్శించారు.

ఈ అప్పును కేసీఆర్ కట్టడని... మనమంతా కలసి కట్టాలని చెప్పారు. జనాలను, మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను కేసీఆర్ కలవరని, కనీసం సెక్రటేరియట్ కు కూడా వెళ్లరని.... ప్రగతి భవన్ లో కూర్చొని నిరంకుశంగా పాలిస్తారని ఆయన దుయ్యబట్టారు .

మహాకూటమి అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. అందరం కలసి కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని చెప్పారు. మన పిల్లలు బాగుండాలంటే టీఆర్ఎస్ ను ఇంటికి పంపాలని తెలిపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,600 పాఠశాలలను మూసివేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు.