ఎమ్మెల్సీ యాదవరెడ్డిని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్

SMTV Desk 2018-11-23 10:53:26  MLC Yadavareddy, Congress,

హైదరాబాద్, నవంబర్ 23: తెరాసలో మరో వికెట్ పడింది.ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పార్టీ క్రమశిక్షణా సంఘం యాదవరెడ్డిని బహిష్కరించాల్సిదిగా సిఫారసు చేయడంతో.. టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ భవన్ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి కె.యాదవరెడ్డి అనుచరుడు. ఇవాళ్ళ మేడ్చల్ లో జరుగబోయే కాంగ్రెస్‌ బహిరంగసభలో సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కనుక ముందుగానే కె.యాదవరెడ్డిపై తెరాస సస్పెన్షన్ వేటు వేసింది.

ఈరోజు వారితో పాటు మరికొందరు తెరాస ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గోప్యత పాటిస్తున్న కారణంగా వారి పేర్లు బయటకు రాలేదు. డిసెంబరు 7వ తేదీలోగా ముగ్గురు తెరాస ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. వారిలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే బయటపడ్డారు. మరి మిగిలిన ఇద్దరు ఎంపీలు ఎవరో చూడాలి.