సుఖాంతమైన పూర్ణిమ సాయి కథ

SMTV Desk 2017-07-21 17:51:29  purnimasai, missed case final police, sheerdhi

హైదరాబాద్, జూలై 21 : ఇటీవల సంచలనం రేపిన పూర్ణిమసాయి కథ సుఖాంతమైంది. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. శుక్రవారం సీడబ్ల్యూసీ సభ్యులు పూర్ణిమసాయి, తల్లిదండ్రులతో విడివిడిగా మాట్లాడారు. కౌన్సిలింగ్‌ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నింబోలీ అడ్డాలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఉన్న పూర్ణిమను తల్లిదండ్రులు తమతో తీసుకెళ్లారు. అసలు విషయంలోకి వెళితే....కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని నిజాంపేట గ్రామానికి చెందిన పూర్ణిమసాయి జూన్‌ 7న ప్రైవేటు క్లాస్‌కు వెళ్తున్నానని తిరిగి ఇంటి నుంచి చేరుకోకుండా సికింద్రాబాద్‌లో రైలెక్కి 8న షిర్డీలో దిగింది. అక్కడే పదిహేను రోజుల పాటు బాబా ఆశ్రమంలో గడిపింది. ఆ తరువాత అక్కడినుంచి ముంబై చేరుకుంది. దాదర్‌ ప్రాంతం డోంగ్రిలోని బాలసదన్‌లో చేరేందుకు యత్నించగా వారు బోయవాడ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి పూర్ణిమను సాయిసుధార్‌ అనే ఆశ్రమంలో చేర్పించారు. తన తల్లిదండ్రులు చనిపోయారని.. తాను అనాథనని పేరు అనికశ్రీ అని మాయమాటలు చెప్పింది. పూర్ణిమ మిస్సింగ్‌ ఫొటోలను బోయవాడ పోలీసులు గుర్తించి తుకారాం గేట్‌ సీఐ సమాచారం ఇవ్వడంతో ఆయన బాచుపల్లి సీఐకి విషయాన్ని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు అక్కడి పోలీసులతో మాట్లాడి పూర్ణిమసాయి ఆశ్రమంలోనే ఉన్నట్లు నిర్దారించారు. ఇంటి నుంచి ఎందుకు వెళ్లావు అని పోలీసులు ప్రశ్నించడంతో...”సాయిబాబా కలలోకి వచ్చాడని తాను ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ముప్పు తప్పదని చెప్పడంతో, తను అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను” అని పూర్ణిమసాయి తెలిపింది.