పోలీసులపై మండిపడ్డ లగడపాటి

SMTV Desk 2018-11-09 17:44:45  Lagada pati Rajagopal, GP Reddy, Congress, Bussiness Man, Search Warrent, Police

హైదరాబాద్, నవంబర్ 09: విజయవాడ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ గురువారం రాత్రి పోలీసులపై మండిపడ్డారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 65లో లగడపాటి మిత్రుడు, ప్రముఖ వ్యాపారవేత్త జీపీరెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలాంటి మందస్తు సమాచారం, సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో సమాచారం అందుకున్న లగడపాటి రాజగోపాల్ అక్కడికి చేరుకుని .. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి సోదాలు చేయడానికి ఎలా వచ్చారంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఐజీ నాగిరెడ్డి భూ విషయంలో తన మిత్రుడిని పోలీసులు ఉద్దేశ పూర్వకంగా బెదిరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు. దీంతో జీపీ రెడ్డి ఇంటి పరిసరాల్లో కాసేపు ఆందోళన నెలకొంది. లగడపాటి అడ్డు కోవడంతో పాటు, సోదాలకు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.