కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ ఆనందం

SMTV Desk 2017-07-21 13:28:31  telangana state, cm kcr, raining, Farmers

హైదరాబాద్‌, జూలై 21 : కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్న సందర్భంగా రైతుల పంటలకు ఢోకా లేదని ఆయన సన్నిహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సీజన్‌ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయా ? లేదా ? అని ప్రభుత్వ అధికారులు కొంత ఆందోళన చెందారు. రాష్ట్రంలో పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవర పడ్డారు. కానీ జూన్‌లో సాధారణ వర్షాన్ని మించి వర్షాలు పడ్డాయి. జూన్‌లో తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతం 128.3 మి.మీ. కాగా, ఈసారి 188.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే రాష్ట్రంలో కురవాల్సిన వర్షాల కంటే 47శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి. కానీ నెలాఖరులో కొంత వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో మళ్లీ కొంత ఆందోళన తలెత్తింది. అయితే వారం రోజులుగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడుతుండటంపై సీఎం కేసీఆర్‌ ఖుషీఖుషీగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. జూలైలో తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతం బుధవారం (ఈనెల 19వ తేదీ) వరకు 135 మిల్లీ మీటర్లు కాగా, ప్రస్తుతం 129 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కురిసిన వర్షానికి, సాధారణ వర్షపాతానికి స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఈ రకంగా తెలంగాణలోని చాలా చోట్ల కురుస్తున్న వర్షాలు ప్రస్తుత వ్యవసాయ వాతావరణానికి అనుకూలమని, ఇప్పటికే వేసిన పంటలకు ప్రయోజనమని పార్టీ ముఖ్యులతో సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేసారు. వర్షాల వల్ల గ్రామాల్లోని చెరువులు, కుంటలు నీటితో నిండాయని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల భూగర్భ జలాల్లో వృద్ధి ఏర్పడుతుందని, ఇది వ్యవసాయానికి, రైతులకు రాబోయే రోజుల్లో మేలు చేస్తుందని సీఎం అన్నారు. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వెల్లడించారు.