రాజకీయాల్లో విమర్శించుకోవడం సహజమే - కేటీఅర్

SMTV Desk 2018-10-29 16:57:57  ktr, trs, chandrababu naidu, hamara hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 29: నిజాంపేట రోడ్డులోని కె. రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ‘హమారా హైదరాబాద్‌’ పేరిట ఓ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ అధికార పార్టీ మంత్రి కేటీఅర్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలలోని కాలనీల అసోసియేషన్స్ అధ్యక్షులు, కార్యదర్శులతో ముఖాముఖీ మాట్లాడుతూ జరుగబోయే ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని కులమతాలు, అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల ఓట్లు చాలా కీలకమని అలాగే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ జంటనగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల ఓట్లు కూడా చాలా ముఖ్యమైనవే కనుక అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి అని చెప్పారు.

ఈ సందర్భంగా వారు ‘సిఎం కేసీఆర్‌తో సహా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గురించి చాలా అనుచితంగా మాట్లాడుతుండటం తమకు బాధ కలిగిస్తోందని, అటువంటి పదప్రయోగం చేయకుండా ఉంటే బాగుంటుందని’ మంత్రి కేటిఆర్‌కు చెప్పారు.

వారి సమస్యలు, సూచనలు అన్నీ ఓపికగా విన్న తరువాత మంత్రి కేటిఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజకీయాల్లో వొక పార్టీని మరొకటి, వొకరినొకరు విమర్శించుకోవడం సహజమే. అవి సదరు నేతలకే వర్తిస్తాయి తప్ప ఆ రాష్ట్ర ప్రజలకు కాదు. కనుక మా విమర్శలను ప్రజలు ఎవరూ వ్యక్తిగతంగా తీసుకొని చూడటం సరికాదు. ఇక్కడ హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా, రాయలసీమ ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలందరినీ మేము మా ప్రజలుగానే భావిస్తున్నాము తప్ప ఏనాడూ వారి పట్ల వివక్ష చూపలేదు. ఈ సంగతి మీకు తెలుసు. కెసిఆర్ కుమారుడినైన నేను మీకు అండగా నిలబడతాను. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.

ఇక టిడిపి, దాని అధినేత చంద్రబాబుపై మేము విమర్శలు చేస్తున్న మాట వాస్తవం. ఆయన తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టి ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నందునే ఆయన మాకు రాజకీయ శత్రువు అయ్యారు. ఆయన తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నందునే మేము విమర్శించవలసివస్తోంది తప్ప ఆయనపై మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమూ లేదు. ఏపీలో టిడిపి, వైకాపా, జనసేన పార్టీలలో ఏది అధికారంలోకి వచ్చినా మాకేమీ అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్‌, బిజెపిలను అడ్డుకోవలసి ఉంది. ఇకపై అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో కొనసాగాలని కోరుకొంటున్నాను,” అని మంత్రి కేటిఆర్‌ అన్నారు.