టిజేఎస్ అభ్యర్ధులను ప్రకటించబోతోందా?

SMTV Desk 2018-10-25 12:56:21  TJS, Kodandaram, Congress, Elections

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ నేడు తన పార్టీ నేతలతో హైదరాబాద్‌లో తమ పార్టీ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 90-95 స్థానాలలో పోటీ చేయాలని మిగిలిన సీట్లను మహాకూటమిలో మిత్రపక్షలకు కేటాయించాలని నిర్ణయించుకొన్నట్లు తెలియడంతో ఇవాళ్ళ జరుగబోయే టిజేఎస్ నేతల సమావేశంలో సీట్ల సర్దుబాట్లు, పార్టీ అభ్యర్ధుల పేర్లు, ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచార షెడ్యూల్ మొదలైన అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. కనుక ఈరోజు జరుగబోయే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితికి 10 సీట్లు ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కనుక టిజేఎస్ తరపున పోటీ చేయబోయే 10 మంది అభ్యర్ధుల పేర్లను నేడు ఆ పార్టీ ఖరారు చేసే అవకాశం ఉంది. అభ్యర్ధుల పేర్లు ఖరారయితే, వెంటనే ఆ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాల్సి ఉంటుంది కనుక దాని గురించి కూడా నేటి సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం.