కార్మికులకు అబద్దపు హామీలు....!

SMTV Desk 2018-10-23 15:15:42  cpi,trs,singareni,kcr

గోదావరిఖని అక్టోబర్23:తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి బొగ్గు ఘని కాంట్రాక్టు కార్మికులను పెర్మినెంట్ చేస్తా అని హామీ ఇచ్చి, వారిని మోసం చేసారంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.సాయిబాబు ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ గేట్‌ -2 వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్‌ఎఫ్‌ బలపరిచిన రామగుండం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి బుర్ర తిరుపతిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కార్మికులకు అండగా నిలిచే సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా బుర్ర తిరుపతి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కార్మిక వర్గంపై ఉన్న భరోసాతోనే తిరుపతిని నిలబెట్టినట్టు చెప్పారు. సమాన పనికి సమాన వేతనం, సుప్రీం కోర్టుతీర్పు అమలు చేయకుండా ప్రభుత్వాలు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి మొత్తం కాంట్రాక్టు కార్మికుల శ్రమపైనే ఆధారపడిందన్న సంగతి పాలకులకు తెలియదా?అని ప్రశ్నించారు. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఏమాత్రమూ లేదన్నారు.అయితే సీపీఐ (ఎం) అభ్యర్దికి ఈ సారి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు.ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర తిరుపతి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, ఎం.రామాచారి, వేల్పుల కుమారస్వామి, ఎన్‌.శంకర్‌, గెల్లు లక్ష్మారెడ్డి, ఎస్‌.రవీందర్ తదితరులు ‌సమావేశంలో పాల్గొన్నారు.