గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు.. రాములు నాయక్

SMTV Desk 2018-10-15 17:26:55  MLC ramulu Naik, ramulu naik joins congress,

హైదరాబాద్‌: తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆరోపించారు. తెరాస నుంచి ఆయనను సస్పెన్షన్‌ చేయడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను గిరిజనుడైనందు వల్లే కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు.


గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు. డి. శ్రీనివాస్‌, కొండా సురేఖను సస్పెండ్‌ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ.. షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలే కాదు పదో తరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనదే అన్నారు. తెలంగాణలో ఈ రోజు చూస్తుంటే బాధేస్తోందన్నారు. గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు.

మరోవైపు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాములు నాయక్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెరాస ప్రకటించిన విషయం తెలిసిందే. రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.