కెసిఆర్‌ అంతా నీచంగా మాట్లాడటం సిగ్గుచేటు

SMTV Desk 2018-10-07 10:14:37  kcr, dk aruna,

సిఎం కెసిఆర్‌ నిన్న వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీనియర్ కాంగ్రెస్‌ నాయకురాలు డి‌కె అరుణను ఉద్దేశ్యించి చాలా తీవ్రపదజాలంతో విమర్శలు చేసి హెచ్చరించారు. వాటిపై ఆమె అంతకంటే ఘాటుగా స్పందిస్తూ, “ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక మహిళపట్ల అంతా నీచంగా మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణా గడ్డపై పుట్టిన కెసిఆర్‌కు ఇంత నీచమైన బాష ఏవిధంగా వచ్చిందో అర్ధం కావడం లేదు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు...బాష తెలంగాణా ప్రజలు తలదించుకొనేలా ఉంది. నా బండారం బయట పెడతానని బెదిరిస్తూ సిఎం కెసిఆర్‌ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు. నా జీవితమంతా తెరిచిన పుస్తకం వంటిది. నా గురించి గద్వాల్ తో సహా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ కెసిఆర్‌ చరిత్రే ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆయన దుబాయికి మనుషులను పంపించుతూ ‘దుబాయి శేఖర్’ అని పేరు సంపాదించుకొన్న మాట వాస్తవమా కాదా? కెసిఆర్‌ ఒక అడుగు ముందుకు వేస్తే నేను ఇదేవిధంగా 10 అడుగులు ముందుకు వేసి మరీ జవాబు చెపుతాను తప్ప ఆయన బెదిరింపులకు భయపడేది లేదు. నేను ఆనాడు మంత్రిగా చేసిన రఘువీరారెడ్డికి హారతి పట్టినట్లు వీడియో ఆధారాలుంటే వాటిని బయటపెట్టమని నేను కెసిఆర్‌కు సవాలు విసురుతున్నాను. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా ఇవ్వకూడదనుకొంటే కెసిఆర్‌ ఏమి చేయగలిగేవారు? కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా ఏర్పాటు చేయబట్టే కదా ఈనాడు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారని మరిచిపోయినట్లున్నారు,” అని డి‌కె అరుణ బదులిచ్చారు.