అధికారం కోసం మరీ ఇంతగా దిగజారి పోవలసిన అవసరం ఉందా?

SMTV Desk 2018-10-02 13:53:52  Harish Rao, BJP, Congress, KCR,TRS

హైదరాబాద్ , అక్టోబర్ 02: మంత్రి హరీష్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేవలం అధికారం చేజిక్కించుకోవడానికే కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐలు అనైతికపొత్తులు పెట్టుకొని మహాకూటమి ఏర్పాటు చేసుకొంటున్నాయి తప్ప వాటికి తెలంగాణా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. లేకుంటే అవి ఏ కారణంతో మహాకూటమిగా ఏర్పడుతున్నాయో చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌, టిడిపిల పొత్తులు జుగుప్సాకరంగా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణా ప్రజల గౌరవం దక్కించుకొన్న కోదండరామ్ కేవలం ఎమ్మెల్యేగా ఎన్నికవడం కోసం ఆ తెలంగాణా ద్రోహులతో చేతులు కలపడం ఇంకా జుగుప్సాకరంగా ఉంది. అధికారం కోసం మరీ ఇంతగా దిగజారి పోవలసిన అవసరం ఉందా? అని నేను వారిని అడుగుతున్నాను. గతంలో టిఆర్ఎస్‌ కూడా కాంగ్రెస్‌, టిడిపిలతో పొత్తులు పెట్టుకొంది కదా? అని వారు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము ఎవరితో పొత్తులు పెట్టుకొన్నా తెలంగాణా రాష్ట్ర సాధన కోసమే తప్ప మా రాజకీయ అవసరాలకోసం పెట్టుకోలేదని వారికీ తెలుసు. తెలంగాణా ఏర్పాటుకు ఆ రెండు పార్టీలు సహకరిస్తామని హామీ ఇచ్చినందునే మేము ఆనాడు వాటితో పొత్తులు పెట్టుకొన్నాము. కానీ ఆ రెండు పార్టీలు మమ్మల్ని మోసం చేసి వాటి నైజాం బయటపెట్టుకొన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రజలందరినీ కూడగట్టుకొని సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో పొరాడి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొన్నాము,” అని చెప్పారు.