మరో భారీ స్కాం బట్ట బయలు

SMTV Desk 2018-09-09 14:53:38  Munakkaya, Huge scam, Munakkaya scam

ఇటీవల వెలుగు చూసిన కరక్కాయ స్కాం నుండి కోలుకోకుండానే మరో స్కాం బయటపడింది. ఈ సారి మునక్కాయ వంతు. వివరాల్లోకి వెళితే ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ సంస్థ, చైన్‌లింక్‌ వ్యాపారం పేరుతో సభ్యులకు భారీ టోకరా వేసింది. మునగాకు, మునక్కాయ పొడితో కోట్లల్లో శఠగోపం పెట్టింది. హైదరాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. గత 3,4 నెలల క్రితం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కొందరు ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ సంస్థ పెట్టారని తెలిపారు. నిరుద్యోగులకు ఆఫర్‌ చేసి ప్రొడక్టు సేల్స్‌ పెంచితే అధికమొత్తం ఇస్తామని ప్రలోభపెట్టారని తెలిపారు. 3,4 నెలల్లో దాదాపు 420 కోట్ల బ్యాంకు డిపాజిట్లు జరిగినట్లు గుర్తించామన్నారు. మెంబర్‌షిప్‌ల పేరుతో భారీగా మోసం చేశారని, ఆయుర్వేదం, ఆరోగ్యం అంటూ.. మునక్కాయ ఉత్పత్తులను ప్రజలకు అంటగట్టారని చెప్పారు. ఆ సంస్థకు సంబంధించిన బ్యాంకు ఎకౌంట్లన్నీ సీజ్‌ చేస్తున్నామని, ఈ స్కీం వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. కరక్కాయ స్కాంలో 10 కోట్లకు పైగా మోసం జరిగిందని సీపీ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.