ముందస్తుకు సై

SMTV Desk 2018-09-05 11:52:49  kcr, Pre elections,

* రేపు క్యాబినెట్ భేటీ * శాసనసభ రద్దుకు నిర్ణయం * 7న హుస్నాబాద్‌లో బహిరంగ సభ * 50 రోజుల్లో సుమారు 100 సభల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సిద్ధమంటు ప్రకటనలు చేస్తున్నారు. తెరాస ప్రగతి నివేదన సభ తర్వాత వేగంగా ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు 2 గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ రద్దుకు ఏకవాఖ్య తీర్మానం చేసి ఆ వెంటనే సీఎం రాజభవన్ కు వెళ్లి మంత్రిమండలి సిఫారసు అందజేస్తారు. హుస్నాబాద్ లో తొలి నియోజకవర్గ సభ ద్వారా ప్రచారం ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో సుమారు 100 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అంటే దాదాపు ప్రతి నియోజకవర్గ సభలోనూ కేసీఆర్‌ మాట్లాడతారు. శాసనసభను రద్దు చేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు ఈ బహిరంగసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. దీనిని బట్టి ఎన్నికల ప్రచారాం మొత్తాన్ని ముఖ్యమంత్రి తన మీద వేసుకొన్నట్లు స్పష్టమవుతుంది. ఈ నెల రెండున హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పటికీ, అసెంబ్లీ రద్దు చేసిన మరుసటి రోజే హుస్నాబాద్‌లో ఆశీర్వాదం పేరుతో జరిగే సభకు ప్రాధాన్యం ఏర్పడింది. మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌లు ఈ సభ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించినట్లు తెలిసింది.