ప్రగతి నివేదన సభ: కేసీఆర్ ప్రసంగం అధ్బుతం

SMTV Desk 2018-09-03 11:32:49  KCR, Pragathinivedana Sabha

దార్శనిక పరిపాలనకు అద్దం పట్టిన కేసీఆర్ ప్రసంగం తరతరాల బానిస సంకెళ్లు తెంచిన వైనానికి వివరణ నిరుపేదలకు మరింత భరోసా కల్పించిన ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ప్రాంతం వేదికగా రంగ రంగ వైభవంగా జరిగిన ప్రగతి నివేదన సభ… ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు కళ్లకు కట్టింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగం… ఆసాంతం ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగింది. 2014కు ముందు అరవై ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేకపోయిన ప్రగతిని కేవలం నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించిన ఘనతను… ముఖ్యమంత్రి ప్రసంగం సాక్షాత్కరింపజేసింది. ఒకటి కాదు.. రెండు కాదు. ఎన్నని చెప్పాలి? ఏమని వివరించాలి? ఇచ్చిన మాటను తీర్చిన విధం దగ్గర్నుంచి… చెప్పని కార్యక్రమాలను కూడా అమలు చేసి శభాష్ అనిపించుకున్న తీరును ముఖ్యమంత్రి వర్ణిస్తుంటే… జనాల నుంచి జయజయధ్వానాలు ప్రతిస్పందనగా వచ్చాయి. ఈ నాలుగేళ్లలో మరే ఇతర ప్రభుత్వానికి వీలు కానంతగా 465 సంక్షేమ పథకాలను అమలు చేసిన విధాన్ని ముఖ్యమంత్రి వివరిస్తుంటే.. లబ్ధిదారుల కళ్లు చెమర్చాయి. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం నుంచి మొదలు పెడితే… అన్నదాతలకు ఉచిత కరెంటు, బీమా, పంటల పెట్టుబడికి ఆర్థిక సహాయం… గొల్ల కురుమలకు ఒక పొట్టేలు సహా గొర్రెల గుంపును అందించిన పథకం… ఆడబిడ్డలకు కొండంత అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకూ పెన్షన్లు… నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. చెరువుల దాహార్తి తీర్చిన మిషన్ కాకతీయ… ప్రతిగడపను తట్టబోతున్న సుజల పథకం మిషన్ భగీరథ. ఇలా చెబుతూ పోతే… వందల సంఖ్యలో పథకాలు పేదల కళ్లలో ఆనందాన్ని కలిగించిన తీరును ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పుడు అమలు చేసిన పథకాలు మాత్రమే కాదు.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింతగా సంక్షేమాన్ని అమలు చేయబోయే తీరును కూడా వివరించి… ప్రతిపక్షాల నోళ్లు మూశారు. చేసిన పనులను సమర్థంగా ప్రజలకు వివరించి.. శభాష్ అనిపించుకున్నారు. మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని… జనంతో జేజేలు పలికించుకున్నారు.