ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాలి

SMTV Desk 2018-08-01 14:27:00  telangana,human trafficking, naini narasimha reddy,

హైదరాబాద్‌, ఆగస్టు 01: మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసైతే దళారులను మరింత కఠినంగా శిక్షిస్తామన్నారు. మానవ అక్రమ రవాణా అనేక రకాలుగా జరుగుతోందని... శ్రమ దోపిడి, వ్యభిచారం, బాల కార్మికులు, బిక్షాటన కోసం మానవ అక్రమ రవాణా నిర్వహిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని గాజుల పరిశ్రమ, ఇటుక బట్టీల్లో బాలకార్మికులు ఉన్నారని... ఆపరేషన్ ముస్కాన్‌ పేరుతో బాల కార్మికులను కాపాడి పునరావాసం కల్పిస్తున్నట్లు నాయిని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధించాలని సిటీ పోలీసు, ప్రజ్వల స్వచ్చంద సంస్థ ఆధ్వర్యలో నిర్వహించిన ర్యాలీలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఆప్జల్‌గంజ్‌ కేంద్ర గ్రంథాలయం నుంచి చార్మినార్ వరకు సాగిన ఈ ర్యాలీలో ‘బాలబాలికలను కాపాడుకుందాం నవ సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ నినాదాలు చేశారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారని హోం మంత్రి తెలిపారు. నిందితులపై పీడీ చట్టం ప్రయోగించి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మానవ అక్రమ రవాణాను సహించేందిలే దని నగర సిపీ అంజినీకుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీ పిలుపునిచ్చారు. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ సమస్యను నిర్మూలించనప్పుడే సమ సమాజాభివృద్ది చోటుచేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్‌, షీ టీమ్‌ అదనపు కమిషనర్ సికా గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.