ఖమ్మంలో వీరంగం సృష్టించిన ఇద్దరు ఎస్సైలు

SMTV Desk 2017-07-16 15:42:03  police, gun, cctv, busstand, sections, shop keeper, khammam.

ఖమ్మం, జూలై 16 : అధికారం ఇచ్చిన ఆయుధం చేతిలో ఉంది కదా అని ఆ ఎస్సైలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఓ దుకాణాదారుడి తలపై తుపాకి ఎక్కుపెట్టి చంపేస్తామని బెదిరించారు. అతడు భయంతో కేకలు వేయగా అక్కడున్న వారంతా గుమిగూడడంతో ఎస్సైలు మెళ్లిగా తప్పించుకున్నారు. వివరాలలోకి వెళితే.. సయ్యద్‌ జవార్‌ అనే వ్యక్తి ఖమ్మం బస్టాండ్‌లో బ్యాగులు, చెప్పుల దుకాణం నడుపుకుంటున్నాడు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న స్పెషల్‌ పార్టీ ఎస్సైలు మహేశ్‌, ప్రతాప్‌ లు శనివారం రాత్రి జవార్‌ దుకాణంలోంచి బస్టాండ్‌ బయటకు వెళ్లేందకు ప్రయత్నిస్తుండగా అతడు ‘ఇది దారి కాదు.. ఇక్కడి నుంచి వెళ్లొద్దని’ అడ్డు చెప్పడంతో ఆగ్రహించిన ఎస్సైలు అతడితో వాగ్వాదానికి దిగి తమతో పెట్టుకుంటే చంపేస్తామని తుపాకితో బెదిరించారు. ఈ ఘటనపై జవార్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వన్‌టౌన్‌ సీఐ దుకాణంలో రికార్డయిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ఆ ఎస్సై ల బెదిరింపు సంభాషణ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైలు పారిపోయారని వారిపై ఐపీసీ 448, 323, 506, 34, 27 సెక్షన్ల కింద కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు.