భానుడు.. ఠారేత్తిస్తున్నాడు..

SMTV Desk 2018-05-30 13:51:42  summer heat, summer season, hyderabad, ap and ts summer heat

హైదరాబాద్, మే 30 ‌: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయన్న చల్లని కబురు అందినప్పటికీ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం మొదలు సూర్యుడు తన ప్రతాపంతో హైదరాబాద్ నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు భాగ్యనగరంలో మంగళవారం మరోసారి నమోదైంది .వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగలే కాదు రాత్రివేళల్లో కూడా ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. రుతుపవనాలు విస్తరించడానికి మరో మూడు నాలుగు రోజుల సమయం ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన ఉక్కపోత, వేడి పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నెల్లూరులో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. విజయవాడ, అమరావతి, ఒంగోలు, కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరో 48 గంటలపాటు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.