వైద్యురాలినంటూ నమ్మించింది.. అడ్డంగా దొరికిపోయింది...

SMTV Desk 2018-05-25 14:08:28  gandhi hospital, fake doctor, boyinpalli news.

హైదరాబాద్, మే 25 : గాంధీ ఆసుపత్రిలో తాను వైద్యురాలినంటూ ప్రియుడిని నమ్మించబోయి ఓ మహిళ అడ్డంగా దొరికిపోయింది. అధికారులు గుర్తించడంతో రెండు రోజుల తర్వాత బండారం బయటపడింది. వివరాలలోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన రిజ్వానాబేగం(32) అనే యువతి బోయిన్‌పల్లిలో నివసిస్తోంది. అక్కడ స్థానిక౦గా ఉండే అబ్దుల్‌ కరీంతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. తను గాంధీ ఆసుపత్రిలో వైద్యురాలినంటూ నమ్మబలికింది. ఇదిలా ఉండగా కరీం.. బంధువొకరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రిజ్వానాబేగం అదే ఆసుపత్రిలో డాక్టర్ కనుక ఈ విషయంలో తనకు సహాయం చేయాలని కరీం తన ప్రియురాలిని కోరాడు. దీంతో ఆమె అతనిని నమ్మించడానికి ఓ ఆప్రాన్‌, స్టెతస్కోప్‌ కొనుగోలు చేసింది. వాటితో రెండు రోజుల నుండి ఆసుపత్రి లోపలి వెళుతూ వస్తోంది. అక్కడ సెక్యూరిటీ ఆమెను నిలువరించగా.. తన వద్ద ఉన్న స్టెతస్కోప్‌ ను చూపిస్తోంది. అనుకున్నట్టుగానే కరీంతోపాటు అతని మిత్రుడు మెయినుద్దీన్‌లను తీసుకుని ఆసుపత్రిలోకి వెళ్లింది. పీఐసీయూ వార్డు వైపు ప్రయాణిస్తూ తను పని చేసేది ఇక్కడే అంటూ చూపించింది. అది గమనించిన ఆసుపత్రి భద్రతాధికారి ప్రదీప్‌, సూపర్‌వైజర్‌ జంగయ్య వారిని నిలువరించారు. తాను డాక్టర్‌నంటూ స్టెతస్కోప్‌ చూపించగా.. వారు గుర్తింపు కార్డు అడగడంతో చూపించలేకపోయింది. అక్కడి వారందరినీ విచారించగా ఆమె ఈ ఆసుపత్రిలో పని చేయడంలేదంటూ తేలింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం రిజ్వానా తోపాటు మరో ఇద్దరిని పోలీసులకు అప్పగించారు.