కాబోయే భర్తపై క్లారిటీ ఇచ్చిన నయనతార..

SMTV Desk 2018-03-24 18:58:10  nayanatara, director vignesh shivan, Nayanatara love proposal.

హైదరాబాద్, మార్చి 24 : అగ్ర కథానాయిక నయనతార.. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్ ప్రేమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంపై నయనతార ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వకపోయినా.. విఘ్నేశ్‌ మాత్రం పలు సందర్భాలలో నయన్ పై ఉన్న ప్రేమను, ఆమెతో విహారయాత్రలు చేసిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. తాజాగా నయన్ కూడా తొలిసారి ఓ వేదికపై మాట్లాడుతూ.. విఘ్నేశ్‌ తనకు కాబోయే భర్తని చెప్పకనే చెప్పారు. చెన్నైలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన అవార్డుల కార్యక్రమ౦లో నయన్.. "ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌"‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నన్ను ప్రోత్సహించిన తల్లి, తండ్రి, సోదరుడు, కాబోయే భర్తకు ధన్యవాదాలు. ఇంతకు ముందు జరిగిన కార్యక్రమాలకు, ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది. పలువురు మహిళల విజయం నాలో మరింత స్ఫూర్తి నింపింది" అంటూ తన ప్రేమపై ఒక క్లారిటీ ఇచ్చేసింది. విఘ్నేశ్‌ పలు విజయవంతమైన తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు.