ర్యాలీ కాస్త నిరసన అయ్యింది

SMTV Desk 2018-10-02 13:02:11  Balakrishna, Balakrishna attack fans, khammam

సత్తుపల్లి , అక్టోబర్ 02: నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి టిడిపి అభ్యర్ధి సండ్ర వెంకటవీరయ్య తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, టిడిపి నేతలు ఆయనకు చాలా ఆత్మీయంగా స్వాగతం పలికారు. రాయపట్నం నుంచి సత్తుపల్లి వరకు దారి పొడవునా ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు వెన్నంటిరాగా ఆయన తల్లాడ నుంచి సత్తుపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నిన్న సాయంత్రం సత్తుపల్లి సభకు ఆయన ఊరేగింపుగా తరలివెళుతుండగా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద నలుగురు అభిమానులు ఆయన వాహనానికి అడ్డుగా నిలబడి కరచాలనం కోసం ప్రయత్నించగా షరా మామూలుగా బాలయ్యకు ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దాంతో ఆయన వాహనం దిగి వారి మెడపై చెయ్యి వేసి పక్కకు తోసేశారు. దాంతో అంతవరకు హుషారుగా సాగిన బాలయ్య ర్యాలీలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కానీ స్థానిక టిడిపి కార్యకర్తలు వారు నలుగురినీ దూరంగా తీసుకుపోయేక బాలయ్య మళ్ళీ ర్యాలీ కొనసాగించారు. అయితే బాలయ్య తీరును నిరసిస్తూ కొందరు స్థానిక యువకులు ఆయన ఫోటో ఉన్న ఫ్లెక్సీలను తగులపెట్టారు. అభిమానంతో కరచాలనం చేయడానికి వస్తే బాలయ్య తమతో దురుసుగా ప్రవర్తించడాన్ని వారు తప్పు పట్టారు. బాలయ్య ఎప్పుడు ప్రజల మద్యకు వెళ్ళినా ఇటువంటి సంఘటనలు జరగడం పరిపాటిగా మారిపోయింది. అందుకు ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. తెలంగాణాలో టిడిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్న ఈ తరుణంలో బాలయ్యకు స్థానిక ప్రజలు అపూర్వమైన స్వాగతం పలికితే, ఆయన వారితో దురుసుగా వ్యవహరించడం వలన టిడిపి పట్ల ప్రజలలో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అదీ...ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన్నప్పుడు అభిమానులతో బాలయ్య ఈవిధంగా ప్రవర్తిస్తే దానికి టిడిపి అభ్యర్ధి సండ్ర వెంకటవీరయ్య మూల్యం చెల్లించవలసి వస్తుందనే సంగతి ఆయన విస్మరించినట్లున్నారు.