నీరు, నిప్పు ధాటికి విలవిలలాడుతున్న ఫిలిప్పీన్స్‌

SMTV Desk 2017-12-24 11:46:23  Philippines, NCC Mall Fire accident, Tempinstorm

మనీలా, డిసెంబర్ 24 : ఫిలిప్పీన్స్‌ దేశంలో నీరు, నిప్పు ధాటికి చాలా మంది ప్రాణాలు ఆవిరైపోయాయి. ఓ పక్క తుపానుతో ఆ దేశం వణికిపోతుంటే, మరోపక్క ఓ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 37 మందిని బలిగొంది. శనివారం రాత్రి స్థానిక ఎన్సీసీ మాల్‌లోని ఫర్నీచర్‌ దుకాణంలో జరిగింది. దీన్ని గమనించి అదుపు చేసే లోపే మంటలు పైఅంతస్తు వరకు వ్యాపించడంతో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందో అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తే కుమార్తె, నగర మేయర్‌ సారా ఘటనాస్థలిని పరిశీలించారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లో రెండో అతిపెద్ద ద్వీపమైన మిందానోవాలో నివసిస్తున్న రెండు కోట్ల మంది ప్రజలు ‘టెంబిన్‌’ తుపాను కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు ఎక్కువగా ఉండే జామ్‌బోవాంగా ద్వీపకల్పంలో వరదల ధాటికి సమీప సాల్వడోర్‌ నదిలో 81 మంది గల్లంతు కాగా, 133 మంది ప్రాణాలు కోల్పోయారు.