ఓవర్ సీస్ లో ‘ఎంసీఏ’, ‘హలో’ సినిమాల జోరు

SMTV Desk 2017-12-23 15:47:36  MCA, Hello, US box office Collections,

హైదరాబాద్, డిసెంబర్ 23 : తెలుగు చిత్ర పరిశ్రమలో తాజాగా విడుదలైన "ఎంసీఏ", "హలో" చిత్రాలు ఓవర్ సీస్ లో వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తున్నాయి. నాని నటించిన చిత్రం ఎంసీఏ ఈ నెల 21న విడుదల కాగా, అక్కినేని అఖిల్ నటించిన "హలో" చిత్రం ఒక్క రోజు తేడాతో డిసెంబర్ 22న విడుదలైంది. అయితే, ఈ రెండు చిత్రాలు అమెరికాలో బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబట్టినట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. "ఎంసీఏ" చిత్రం రూ.2.70 కోట్లు వసూలు చేయగా, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హలో’చిత్రం రూ.1.35 కోట్లు రాబట్టినట్లు ఆయన పేర్కొన్నారు. "ఎంసీఏ" మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ అనే ఉప శీర్షికతో, కథానాయకుడిగా నాని నటించగా, సాయిపల్లవి ఆయన సరసన నటించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరించారు. భూమిక, రాజీవ్‌ కనకాల, ఆమని ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం గురువారం విడుదలై, మంచి టాక్‌ అందుకుంది. అమెరికాలో ఒక్కరోజులోనే దాదాపు ఆఫ్‌ మిలియన్‌ డాలర్ల మార్కును చేరుకుందని తరణ్ వెల్లడించారు. బుధవారం (ప్రివ్యూ) 303,981 డాలర్లు, గురువారం 117,689 డాలర్లు మొత్తం 421,670 డాలర్లు (రూ.2.70 కోట్లు) వసూలు చేపట్టిన ఘనత ఎంసీఏ సొంతం చేసుకుంది. అఖీనేని అఖిల్ కథానాయకుడిగా "హలో" చిత్రంలో నటించారు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికాగా, తొలి పరిచయం అయ్యారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విశ్లేషకుల మన్ననలు పొందింది. అమెరికాలో గురువారం (140 లొకేషన్లలో) నిర్వహించిన ప్రివ్యూలోనే ఈ చిత్రం 210,840 డాలర్లు (రూ.1.35 కోట్లు) వసూలు చేసినట్లు తరణ్‌ తెలిపారు. "హలో" కేవలం ప్రివ్యూతోనే ఇంత మొత్తం రాబట్టడంతో ఇంకా ఈ చిత్రంపై భారీ అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.