ఉగ్రవాదంపై విధానం మార్చుకోవాలి- అమెరికా రక్షణ మంత్రి

SMTV Desk 2017-06-15 13:06:53  Afghanistan,Terrorism,America,Defence Minister James Matis,senetor Jack keyin

వాషింగ్టన్, జూన్ 15 : ఆఫ్ఘనిస్టాన్ లో ఉగ్రవాదంపై కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా విజయం సాధించలేకపోతున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మ్యాటిస్ నిజాయితీగా ఒప్పుకున్నారు. ఆ దేశంలో తీవ్రవాదులు ఉగ్రకార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు. సెనేటర్ జాన్ మెక్ కెయిన్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సాయుధ దళ సేవల సెనేట్ కమీటీ విచారణ సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఈ సంవత్సరం కూడా విధ్వంసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని, మన విధానాలను మార్చుకుని ఆ దేశానికి సైనిక సహాయాన్ని పెంచితే శత్రువును నియంత్రించవచ్చని మ్యాటిస్ తెలిపారు. సమావేశంలో మెక్ కెయిన్ మాట్లాడుతూ, ఆఫ్ఘన్ ఉగ్రవాదులపై అమెరికా ఎనిమిదేండ్లుగా అనుసారిస్తున్న వ్యూహం సఫలం కాలేదని అన్నారు. అమెరికా సైనికుల త్యాగాల తర్వాత కూడా ఆఫ్ఘన్ అంతర్యుద్ధ దేశంగానే మిగిలిపోయిందని తెలిపారు. ఆరు మాసాలైన ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఓ విధానాన్ని నిర్ణయించలేదని మెక్ కెయిన్ ఆరోపించారు.