ఉల్లిపాయ చేసిన రచ్చ...!

SMTV Desk 2017-06-15 13:03:21  Alameda County, California, United States, onion,

కాలిఫోర్నియా, జూన్ 15: ఆర్డర్ చేసిన ఆహారంతో పాటు ఉల్లిపాయ వడ్డించినందుకు అమెరికాలో ఓ భారతీయుడు వీరంగం సృషించాడు. పీకలదాకా తాగొచ్చి మరీ చిందులేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ అమెరికన్ యుబారాజ్ శర్మ (43) ఈ నెల 5న ఓక్లాండ్ లోని ఆల్ ఇండియా రెస్టారెంట్ వెళ్లి ఓ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఉల్లిపాయలను మాత్రం ఆర్డర్ చేయలేదు. అయినా అక్కడ సర్వర్లు ఆయన ఆర్డర్ చేసిన ప్లేట్ లో ఉల్లిపాయలను ఉంచడంతో మొదలైంది గొడవ. రెస్టారెంట్ యాజమాన్యానికి యూబారాజ్ శర్మకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన శర్మ మర్నాడు ఫుల్ గా మద్యం తాగి ఆల్ ఇండియా రెస్టారెంట్ కు చేరుకున్నాడు. తన దగ్గర రివాల్వర్ ఉందని, షూట్ చేసి పడేస్తానని రెస్టారెంట్ యజమాని రవీందర్ సింగ్ ను బెదిరించి, బండబూతులు తిట్టాడు. దీంతో బెదిరిపోయిన సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారొచ్చి తాగుబోతు శర్మను కారెక్కించుకుని వెళ్లారు. బెదిరింపులు, అసభ్యకరమైన ప్రవర్తన, అరెస్ట్ ను నిరోధించడం, బహిరంగ మద్యపానం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.