వాట్సాప్‌ సేవలను నిలిపివేస్తున్నారా..!

SMTV Desk 2017-11-04 16:52:56  Internet Telecom Regulatory Internet Service Providers, social media, whats app, yap

కాబూల్, నవంబర్ 04 ‌: అఫ్గానిస్థాన్‌ టెలికాం రెగ్యులేటరీ(ఏటీఆర్‌ఏ) ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు రాసిన లేఖలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ లేఖలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, టెలిగ్రామ్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు, తెలిపింది. అయితే, నిజంగానే వాట్సాప్‌ సేవలను నిలిపివేస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. తాలిబన్లు, ఇతర తిరుగుబాటు దారులు ఈ సేవలు వినియోగించడాన్ని అడ్డుకునేందుకు నేషనల్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ సెక్యూరిటీ ఆదేశాల మేరకే వాట్సాప్‌ సేవలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనిపై టెలికాం మంత్రి షాహ్‌జద్‌ ఆర్యోబీ వాదన మరోలా ఉంది. వాట్సాప్‌ సేవల్లో లోపాలు తలెత్తుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పనితీరును మెరుగుపరిచేందుకు కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా ఈ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నవంబర్‌ 1న టెలికాం రెగ్యులేటరీ ఏటీఆర్‌ఏ ఎటువంటి ఆలస్యం చేయకుండా 20రోజుల పాటు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ సేవలను నిలిపివేయాల్సిందిగా ఇంటర్నెట్‌ కంపెనీలను ఆదేశించినట్లు సమాచారం.