ఉత్తరకొరియాకు దీటుగా అమెరికా డ్రిల్..

SMTV Desk 2017-11-03 15:31:47  utharakoriya, america, drill

సియోల్, నవంబర్ 03 : ఉద్రిక్త పరిస్థితుల నడుమ అగ్రరాజ్యం అమెరికా ఉత్తరకొరియాను లక్ష్యంగా చేసుకుని డ్రిల్ ను చేపట్టింది. ఇప్పటికే ఉత్తరకొరియా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోని అమెరికా దానికి దీటుగా బదులిస్తూ వస్తోంది. ఈ క్రమంలో నేడు అగ్రరాజ్యం మరోసారి ఈ డ్రిల్‌ చేపట్టింది. కాని ఈ సారి ఉత్తరకొరియా లక్ష్యంగా చేసుకున్న గువామ్‌ ద్వీపం నుంచి ఈ డ్రిల్‌ చేపట్టడం గమనార్హం. అమెరికా అధీనంలోని భూభాగమైన ఈ గువామ్‌ ద్వీపాన్ని పూర్తిగా నాశనం చేస్తామంటూ ఆ మధ్య ఉత్తరకొరియా హెచ్చరికలు చేసింది. దీనికి బదులిచ్చేందుకు అమెరికా తాజా డ్రిల్‌ చేపట్టింది. ఉత్తరకొరియాకు తమ సైనిక సామర్థ్యాలను తెలియజేసేందుకు గువామ్‌లోని అండర్సన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి రెండు సూపర్‌సోనిక్‌ యుద్ధవిమానాలను కొరియా ద్వీపంపైకి పంపింది. వీటిని ఎస్కార్ట్‌ చేస్తూ దక్షిణకొరియా ఫైటర్‌జెట్‌లు కూడా ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. మరోవైపు అమెరికా డ్రిల్‌ను ఉత్తరకొరియా ఖండించింది. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు అణు యుద్ధానికి ఆజ్యం పోసేందుకు చూస్తున్నాయని ఉత్తరకొరియా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆసియా దేశాల పర్యటనకు కొద్ది రోజుల ముందే ఈ డ్రిల్‌ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.