విమానం గల్లంతు..అండమాన్ కు సమీపంలో శకలాలు

SMTV Desk 2017-06-08 10:28:45  myanmar, eroplan, y-8-200F, missing, 120 members missing

యాంగన్, జూన్ 8: విమానాలు అదృష్యం అయి విషాదాన్ని మిగిలుస్తున్న సందర్భాలు ఇటీవల కాలంలో పెరిగి పోయాయి. ఏడాదిన్నర క్రితం ఎంహెచ్ 370 గల్లంతు ద్వారా 480 మందికి పైగా ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. తాజాగా మయన్మార్ సైన్యానికి చెందిన విమానం గల్లంతై తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మయాన్మార్ లోని మయిక్ పట్టణం నుండి యాంగన్ నగరానికి వై-8-200ఎఫ్ విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తు అదృష్యం అయింది. ఆ పట్టణం నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్దేరిన విమానం అరగంట తర్వాత డవేయి పట్టణానికి పశ్చిమంగా 70 కి.మీల దూరంలో ఉండగా గగనతల రద్దీ నియంత్రణ కేంద్రంతో సంబంధాలు కోల్పోయిందని అధికారులు వెల్లడించారు. విమానం టేకాఫ్ అయినప్పుడు వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. విమానంలో సైనికులు, వారి కుటుంబ సభ్యులు, 14 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు సైన్యం వెల్లడించింది. అయితే ప్రయాణికుల సంఖ్య విషయమై ఖచ్చితమైన సమాచారం అందించలేక పోయారు. ముందుగా 120 మంది ప్రయాణికులున్నట్లు ప్రకటించి ఆ తర్వాత 106 మంది ఉన్నట్లుగా ప్రకటనలు వెలువడ్డాయి. విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు అండమాన్ సముద్రంలో దొరికాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గాలింపు చర్యల్లో పాల్గొన్న నావికాదళ బృందం అన్వేషణలో డవేయి పట్టణానికి 218 కి.మీ ల దూరంలో శకలాలు గుర్తించింది.