చనిపోయిన బిడ్డను పూడ్చేందుకు గుంత తీస్తే...బ్రతికున్న మరో బిడ్డ ప్రత్యక్షమైంది!!!

SMTV Desk 2019-10-14 14:29:00  

పుట్టిన బిడ్డ చనిపోవడంతో శవాన్ని పూడ్చి పెట్టడం కోసం శ్మశానానికి వెళ్లిన తండ్రి ముందు మరో బిడ్డ ప్రత్యక్షమైంది. తన బిడ్డ శవం పూడ్చిపెట్టడానికి గుంత తీస్తుండగా మూడు అడుగుల లోతులో ఓ మట్టి కుండ తగిలింది. దాన్ని బయటకు తీసి చూడగా.. అందులో ఓ పసిపాప బతికి ఉండటం గమనించారు. కష్టంగా శ్వాస తీసుకుంటున్న ఆ చిన్నారిని వెంటనే బయటకు తీసిన ఆయన.. పాలతో తడిపిన దూదితో ఆమె ఆకలి తీర్చారు. తర్వాత చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి....ఆ పాపను రక్షించిన వ్యక్తి పేరు హితేశ్ కుమార్ సిరోహి. ఆయన భార్య వైశాలి బరేలీలో ఎస్సైగా పని చేస్తున్నారు. గర్భం దాల్చిన ఏడు నెలలకే పురిటి నొప్పులు రావడంతో బుధవారం ఆమెను ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చారు. గురువారం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ.. పుట్టిన కాసేపటికే ఆ పసికందు ప్రాణాలు వదిలింది.దీంతో గురువారం సాయంత్రం సిరోహి.. పాప శవాన్ని పూడ్చిపెట్టడం కోసం శ్మశానానికి వెళ్లి గొయ్యి తీశాడు. మూడు అడుగుల లోతుకు తవ్వగానే.. ఓ మట్టి కుండ తగిలింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అందులో ఓ పాప పడుకోబెట్టి ఉండటాన్ని గమనించారు. ఆ పాప బతికి ఉండటంతో ఆశ్చర్యపోయిన సిరోహి.. కష్టంగా శ్వాస తీసుకుంటున్న చిన్నారిని వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. బతికి ఉండగానే ఆ చిన్నారిని పూడ్చిపెట్టిన తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆ పాప తల్లి ఎవరో గుర్తించేందకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఆ పాప చికిత్సకు అయ్యే ఖర్చును తాను భరించేందుకు బిథారి చెయినాపూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా ముందుకొచ్చారు. దీంతో ఆ బాలికను మెరుగైన వైద్యం కోసం మరో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యం మెరుగైందని సీఎంవో తెలిపింది. బతికి ఉండగానే పాపను పూడ్చేసిన తల్లిదండ్రులను గుర్తించడం కోసం దర్యాప్తు ప్రారంభించారు.