జైలు నుంచి తప్పించుకొని 17 ఏళ్లుగా గూహలో జీవనం...మాట్లాడటం కూడా మరిచాడు!

SMTV Desk 2019-10-02 15:25:11  

17ఏళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకొని అడవిలోని గూహల్లో జీవిస్తున్న ఓ ఖైదీని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయాడు. అప్పటి నుంచి మళ్లీ జనావాసాల్లో అడుగు పెట్టలేదు. అడవిలో ఓ గుహను నివాసంగా మార్చుకుని 17 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నాడు. సాధారణ మనుషులు సైతం ప్రవేశించలేని ఆ ప్రాంతాన్ని కనుగోవడం పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో అతడు అక్కడే అడవి మనిషిలా జీవనం సాగించాడు. చైనాకు చెందిన సాంగ్ జియాంగ్ అనే వ్యక్తి 2002లో మహిళలు, చిన్నారులను అక్రమ తరలింపు కేసులో అరెస్టయ్యాడు. పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకున్న అతడు యున్నాన్ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నాడు. 17 ఏళ్లుగా ఓ గుహలో జీవించాడు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపుకుంటూ, జంతువులను వేటాడుతూ, పండ్లను తింటూ జీవితం గడిపాడు. అయితే, అక్కడ జనజీవనం లేకపోవడంతో జియాంగ్ మాట్లాడటం మరిచిపోయాడు. దట్టమైన అడవుల మధ్యలో ఓ వ్యక్తి జీవిస్తు్నాడనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం సోదాలు జరిపారు. అప్పటికీ అతడి ఆచూకీ లభించకపోవడంతో డ్రోన్లకు కెమేరాలు పెట్టి పంపారు. ఎట్టకేలకు ఆ డ్రోన్లు ఓ గుహను కనిపెట్టాయి. దీంతో పోలీసులు ఆ గుహ వద్దకు చేరుకుని జియాంగ్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అయితే, జియాంగ్ తమతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడని, 17 ఏళ్లుగా మౌనంగా జీవించడం వల్ల అతడు మాట్లాడలేక ఇబ్బంది పడ్డాడని అధికారులు తెలిపారు.