మూగజీవి పట్ల ఇంత క్రూరత్వమా!

SMTV Desk 2019-07-17 12:30:19  darren carolyn carter

కెనడాకు చెందిన ఓ దంపతులు మూగజీవుల పట్ల అతిక్రూరంగా ప్రవర్తించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వేటాడి చంపిన మృగరాజు కళేబరం ముందు గాఢంగా ముద్దు పెట్టుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారిలో ఆ దంపతులను తిట్టనివారంటూ లేరు. జంతు ప్రేమికులైతే వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. పూర్తి వివరాల ప్రకారం...కెనడాలోని అల్బెర్ట్‌కు చెందిన డారెన్‌, కారోలిన్‌ కార్టర్‌ దంపతులు ఈ సింహాన్ని స్వయంగా వేటాడారు. వేటాడి చంపిన అనంతరం సింహం కళేబరం పక్కనే ఇలా గర్వంగా, ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫొటోను లెజెలేలా సఫారీ అనే కంపెనీ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసింది. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. అడవిలో సింహాలు, జిరాఫీలు మొదలుకొని.. అనేక రకాల జంతువులను వేటాడి చంపేందుకు అనుమతిస్తుంది. అంటే అడవిలో వేట ఇష్టపడే ఔత్సాహికులు.. ఈ కంపెనీని ఆశ్రయిస్తే.. ఎంచక్కా చట్టపరమైన చిక్కులు లేకుండా ఆ అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. కలహారి ఏడారిలో అడవి మృగరాజును వేటాడటం కంటే మరో గొప్ప అనుభూతి మరొకటి ఉండదు అంటూ లెజెలేలా సఫారీ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఈ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోపై ఆన్‌లైన్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు, దూషణలు వ్యక్తం కావడంతో సదరు కెనడా దంపతులు తమ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలను ప్రైవేట్‌ చేశారు. లెజెలేలా సఫారీ తన ఫేస్‌బుక్‌ పేజీని తొలగించింది. అయితే, వేటను వ్యాపారంగా చేస్తున్న తమ కంపెనీ వ్యవహారాలు ఇకపై కొనసాగుతాయని, ఔత్సాహికులకు ఇకముందు కూడా మెరుగైన సేవలందిస్తామని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది.