లండన్‌లో తెలంగాణ యువకుడి హత్య

SMTV Desk 2019-05-10 14:08:17  Murder,

హైదరాబాద్‌ పాతబస్తీలో నూర్ఖాన్ బజార్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ నజీముద్దీన్ (29) అనే యువకుడు లండన్‌లో హత్యకు గురయ్యాడు. లండన్ పోలీసుల సమాచారం ప్రకారం అతను ఆరేళ్ళ క్రితం వైద్యురాలైన తన భార్యతో కలిసి లండన్ వచ్చాడు. అప్పటి నుంచి స్థానిక టెస్కో సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతని భార్య లండన్‌లోనే వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

గురువారం సాయంత్రం అతను సూపర్ మార్కెట్లో పనిచేసుకొంటుండగా గుర్తు తెలియని ఒక వ్యక్తి అక్కడకు వచ్చి హటాత్తుగా నజీముద్దీన్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఘటనాస్థలంలోనే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నజీముద్దీన్‌పై దాడి చేసిన వ్యక్తి పాకిస్థానీ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పాతబస్తీలో నివాసం ఉంటున్న అతని తల్లి తండ్రులు కుమారుడి మరణవార్త తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నజీముద్దీన్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌ రప్పించేందుకు సహాయపడాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.