రంజాన్‌ ఉపవాస దీక్షలపై నిషేధం : చైనా

SMTV Desk 2019-05-03 12:42:28  china, ramzan, ramadan fasting festival

బీజింగ్: చైనా ప్రభుత్వం అక్కడి ముస్లిం ప్రజలపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముస్లింలకు రంజాన్‌ మాసం అంటే ఎంత పవిత్రమైనదో తెలిసిన విషయమే. అయితే రంజాన్‌ వేళల్లో ఉపవాసం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడ ఉన్న ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం చైనాలో వివాదాస్పదంగా మారింది. ముస్లింలు అధికంగా ఉండే క్సింజియాంగ్‌ ప్రాంతంలో పనిచేసే ముస్లిం ప్రభుత్వ అధికారులు, విద్యార్ధులు, టీచర్లు దీక్ష చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు రంజాన్‌ మాసం సందర్భంగా అక్కడి రెస్టారెంట్లను తెరచిఉంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లింలు ఉపవాసం చేస్తారు. చైనా ప్రభుత్వం ఉపవాస దీక్షలపై నిషేధం విధిస్తుండటంతో అక్కడి ప్రజల మధ్య మతపరమైన గొడవలకు దారితీస్తుందని ఉయిఘర్‌ మైనార్టీ వారు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే విషయంపై ఘర్షణలు చెలరేగడంతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్సింజియాంగ్‌ ప్రాంతానికి ఉగ్రవాద ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతుంది.