కాంగోలో ఘోర పడవ ప్రమాదం.. 150 మంది గల్లంతు

SMTV Desk 2019-04-20 18:14:42  Ship, congo, africa ship,

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కివూ సరస్సులో పడవ మునిగి సుమారు 150 మంది గల్లంతయ్యారు. సోమవారమే ఈ ప్రమాదం జరగ్గా..బుధవారం నుంచి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇప్పటి వరకు 14 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన ప్రయాణికులంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. గజఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో కాంగో సంతాప దినాలను పాటిస్తోంది.

పడవలో దాదాపు 150 మంది ప్రయాణికులతో పాటు బరువైన సామాగ్రి ఉండడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు అందకపోవడంతో ఏ ఒక్కరూ చావు నుంచి తప్పించుకునే పరిస్థితి లేకపోయిందని సమాచారం. పడవ ప్రమాదంపై కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకేడి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు సహాయక చర్యల్లో కాంగో ప్రభుత్వానికి సాయం చేస్తామని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే వెల్లడించింది. కాంగోలో పడవ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పాతతరం పడవలను వినియోగించడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి