మసూద్‌ను టార్గెట్‌ చేసిన అగ్రరాజ్యం

SMTV Desk 2019-03-28 13:34:55  masood azar,

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజార్‌ను.. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై అమెరికా చర్యలు మొదలుపెట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారీ చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది. రెండు వారాల క్రిత‌మే అమెరికా ప్రతిపాద‌న‌ను త‌న వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌ళ్లీ బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల స‌హ‌కారంతో అమెరికా.. ఐక్యరాజ్య స‌మితిలో అజ‌ర్ నిషేధంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తీర్మానంలో మసూద్‌ అజ‌ర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాల‌ని, అత‌ని ఆస్తుల‌ను స్తంభింప‌చేయాల‌ని కోరింది. ఐసిస్‌, అల్‌ఖైదాతో జైషే నేతకు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఆయా సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ప్రణాళికలు రూపొందించడం, ఏర్పాట్లు చేయడం, మద్దతు తెలపడం వంటివి చేశారని అమెరికా పేర్కొంది.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన పుల్వామాలో ఉగ్ర దాడిలో త‌మ పాత్ర ఉనట్లు జైషే మహ్మద్‌ సంస్థ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్‌ను హెచ్చరించిన అమెరికా..ఉగ్రవాద నిర్మూలన దిశగా అడుగులు ముందుకు వేస్తుంది.