సిరియాలో ఐఎస్‌ఐఎస్ అంతం

SMTV Desk 2019-03-26 16:48:54  syria, isis, syria army, syrian democratic forces isis

బగ్‌హజ్, మార్చ్ 26: సిరియా తూర్పు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ పూర్తిగా అంతం అయ్యింది. అమెరికా మద్దతుతో సాగుతోన్న సిరియా డెమోక్రాటిక్ ఫోర్సు (ఎస్‌డిఎఫ్) బగ్‌హజ్ గ్రామంలోని ఐఎస్ తుది కంచుకోట స్థావరాన్ని వశం చేసుకొని తమ జెండా ఎగురవేసింది. పూర్తి స్థాయిలో జిహాది గ్రూప్‌ను తుదముట్టించినట్లు ఈ స్థావరం కూడా తమ స్వాధీనం అయినట్లు సిరియా సేనలు తెలిపాయి. సిరియా సేనల జెండా ఎగురుతూ ఉన్న పాడుబడ్డ కోట వంటి భవంతిపై జెండా రెపరెపలాడుతూ ఉన్న దృశ్యాలను కుర్దిష్ రొనాహీ టీవీలో చూపించారు ఈ స్థావరాన్ని ఇస్లామిక్ స్టేట్ సంస్థను కాలీఫేట్‌గా వ్యవహరిస్తున్నారు. దీనిని తాము చేజిక్కించుకున్నట్లు సిరియా సేనలు ప్రకటన వెలువరించాయి. ఇదే సమయంలో ఆదివారం నుంచే ఈ ప్రాంతంలోని పలు కందకాలలో ఉన్న వందలాది మంది ఐసిస్ జిహాదీలు తుపాకులను త్యజించి వచ్చి అక్కడున్న అమెరికా నేతృత్వపు సిరియా దళాల ముందు లొంగిపోతూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ నెలకొని ఉన్న తీవ్రవాద ప్రచ్ఛన్న సామ్రాజ్యం అంతరించినట్లే అయితే నిర్బంధంలోకి తీసుకున్న వేలాది మంది విదేశీ జిహాదీస్టులు ఎప్పటికైనా పేలే టైంబాంబుల వంటి వారని, వారిని తక్షణం అన్ని విధాలుగా కట్డడి చేయాల్సి ఉందని సిరియాకు చెందిన కుర్దులు హెచ్చరించారు. ఇరాక్ సరిహద్దులలో ఉండే మారుమూల బగ్‌హజ్ గ్రామంలోని స్థావరం దెబ్బతినడంతో అక్కడి నుంచి సరెండర్ అవుతున్న ఉగ్రవాదులు పలువురు అక్కడున్న ట్రక్కులలో ఎక్కుతూ ఉండటం, వారిని సిరియా సేనలు తమ క్యాంప్‌లకు తరలించడం స్థానిక టీవీలలో ప్రసారం అవుతూ వచ్చింది. చాలా మంది టన్నెల్స్ నుంచి వచ్చి సరెండర్ అయినట్లు కుర్ధుల ప్రతినిధి జియాకెర్ అమెద్ తెలిపారు.