స్టేడియంలోనే కన్ను మూసిన జాతీయ రెజ్లర్..

SMTV Desk 2017-08-10 13:31:50  jarkhand, stadium, short circuit, resler

జార్ఖండ్, ఆగస్ట్ 10 : రెజ్లర్ గా జాతీయ స్థాయిలో ఎదిగాడు. మరెన్నో ఆశలతో, ఇంకేదో సాధించాలన్న తపనతో స్టేడియంలో ప్రాక్టీసు మొదలు పెట్టాడు. కాని విధి వక్రించడంతో ప్రాక్టీస్ చేసే స్టేడియంలోనే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ స్టేడియంలో వర్షం కారణంగా నీరు చేరడంతో అక్కడ షార్ట్ సర్కూట్ జరిగి ఆ నీటిలో విద్యుత్ ప్రవహించింది. ఈ విషయం తెలియని రెజ్లర్ విశాల్ కుమార్(25) అక్కడకు వెళ్ళగా షాక్ తగిలి అపస్మార స్థితిలో పడి వున్నాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే విశాల్ ను సర్దార్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా నిండా మునిగి ఉన్న స్టేడియంలోకి విశాల్ ఎందుకు వెళ్ళాడో మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలానాథ్ సింగ్ తెలిపారు. ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా రూ. లక్ష నగదు, తన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకు నెలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించామని, అంతేకాకుండా కేంద్ర క్రీడాశాఖ నుంచి రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు.