న్యూజిలాండ్ కాల్పులు : ఐదుగురు ఇండియన్స్ మృతి

SMTV Desk 2019-03-17 17:17:07  New Zealand,

ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో మసీదులపై కాల్పుల ఘటన తర్వాత 9మంది భారతీయుల ఆచూకీ తెలియడం లేదని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ తాజాగా ధ్రువీకరించిన వివరాల ప్రకారం.. అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయాన్ని హైకమిషన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మృతుల్లో మహెబూబ్ ఖోఖర్, రమీజ్ వోరా, ఆసిఫ్ వోరా, అన్సీ అలీబావా,ఒజైర్ ఖాదిర్ ఉన్నట్టు తెలిపింది. బరువెక్కిన హృదయంతో ఈ వార్తను పంచుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

క్రైస్ట్‌చర్చ్ బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించేందుకు ఆరుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఇండియన్ హైకమిషన్ నియమించింది. ఇంకా తమవారి ఆచూకీ తెలుసుకోలేని భారతీయులు ఎవరైనా ఉంటే.. హెల్ప్ లైన్స్‌కు కాల్ చేయాలని ట్విట్టర్ ద్వారా నంబర్స్ షేర్ చేసింది.

క్రైస్ట్‌చర్చ్‌ మసీదులపై కాల్పుల ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డన్‌కు లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో హింసకు, విద్వేషానికి తావు లేదన్నారు. ఇదిలా ఉంటే, కాల్పులకు పాల్పడిన బ్రెంట‌న్ ట‌రెంట్‌ ఆస్ట్రేలియాకు చెందినవాడని తెలిసిందే. అతివాది అయిన అతను యూరోపియన్ దేశాలకు ముస్లిం వలసలను ఆపేందుకే కాల్పులకు పాల్పడినట్టు ఆన్‌లైన్‌లో రాసిన 73 పేజీల వివరణలో పేర్కొన్నాడు.