ఇథియోపియాలో కుప్పకూలిన బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ విమానం...157 మంది మృతి

SMTV Desk 2019-03-11 11:08:17  Ethiopian Airlines Flight, Boeing 737 MAX 8, Ethiopian Airlines Boeing 737 MAX involved in fatal crash, Ethiopian Boeing 737-8 MAX 8 ET-AVJ crashes in Ethiopia,157 killed

ప్రేటోరియా/ఆఫ్రికా, మార్చ్ 11: ఇథియోపియాలో బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ విమానం కుప్పకూలి 157మంది మృతి చెందారు. అడిస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 157 మంది చనిపోయారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారిలో నలుగురు భారతీయులతో పాటు 33దేశాలకు చెందిన ప్రయాణికులున్నారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్‌ 737–8 మ్యాక్స్‌ గత నవంబర్‌లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. బోయింగ్‌ విమానాలు భద్రతకు పెద్ద పీట వేస్తాయని మార్కెట్లో మంచి పేరుంది. కాని వరుస ప్రమాదాలు మాత్రం వాటి రక్షణను వేలెత్తి చూపిస్తున్నాయి. అయితే సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయంటున్నారు అధికారులు. విమానాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే, వాటిని వినియోగించడం మొదలుపెట్టాకే అవి బయటపడతాయని, సాధారణంగా తొలి మూడు నెలల్లోనే అవి పరిష్కృతమవుతాయన్నారు. ప్రతీ విమానంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, కానీ అవి భద్రతను ప్రమాదంలో పడేసే స్థాయిలో ఉండవంటున్నారు అధికారులు.