భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్

SMTV Desk 2019-03-05 11:50:28  trump, India,

వాషింగ్టన్, మార్చ్ 04: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాను చాలా ఎక్కువగా సుంకాలు విధించే దేశంగా అభివర్ణించారు. తమ దేశ ఉత్పత్తులపై భారత్‌ అధికంగా సుంకాలు విధిస్తోందని, ప్రతిగా తామూ కూడా సుంకాలు విధించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. శనివారం మేరీల్యాండ్‌లో నిర్వహించిన కన్జర్వేటివ్‌ రాజకీయ కార్యాచరణ సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా కన్జర్వేటివ్‌లు, ఎన్నికైన అధికారులు పాల్గొనే ఈ వార్షిక సమావేశంలో ట్రంప్‌ ఏకంగా రెండుగంటల పాటు ప్రసంగించారు.

దేశీయ, ప్రపంచ వర్తమాన విషయాలతో పాటు భారత్‌ తదితర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రసంగించారు. సుంకాల విధింపుపై తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో భారత్‌ను ఓ ఉదాహరణగా ప్రసంగించారు.

ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘హార్లీ డేవిడ్‌సన్‌ మోటారు సైకిళ్లనే తీసుకోండి. భారత్‌ వీటిపై తమ దేశంలో నూరుశాతం దిగుమతి సుంకం విధించింది. నేను రెండు నిముషాలు ఆ దేశంతో మాట్లాడితే సుంకాన్ని సగానికి తగ్గించారు. అయినా అది ఎక్కువే. భారత్‌ చాలా ఎక్కువ సుంకాలు విధించే దేశం. నేను మాత్రం వారు మనదేశంలో అమ్ముతున్న వస్తువులపై 25శాతం సుంకాలు మాత్రమే వేయాలనుకుంటున్నాను’ అని ట్రంప్‌ అన్నారు.