నేను అర్హుడిని కాదు: ఇమ్రాన్

SMTV Desk 2019-03-04 20:09:35  Imran Khan, Abhinandan, India, Pakistan, Nobel Prize

పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన భారత పైలట్ అభినందన్ ను తిరిగి భారత్ కు అప్పగించినందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకే ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు ఇమ్రాన్ కు నోబెల్ బహుమతిని ఇవ్వాల్సిందేనని అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ దీనిపై స్పందించారు.

ఇమ్రాన్ ఖాన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న వేళ, ఇమ్రాన్ స్పందిస్తూ, నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడిని కాదని చెప్పారు. అర్హుడిని కాదని చెబుతూనే, దానికి అర్హులెవరో కూడా చెప్పారు. కశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిష్కరించి, శాంతికి, మానవాభివృద్దికి ఎవరైతే మార్గం సుగమం చేస్తారో, వారు నోబెల్‌కు అర్హులని అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్ తో శాంతి చర్చలకు తాను సిద్దమంటూ చెబుతూనే ఉన్నారు. కానీ ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే, మరోవైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరి నచ్చకనే ఆ దేశంతో చర్చలకు దూరంగా ఉంటోంది.