ప్రతీకారం తీర్చుకుంటాం: పాక్

SMTV Desk 2019-02-27 09:50:24  Pakisthan, Urgent Meeting, NCI, NSC, Imran Khan,

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 27: భారత్ మంగళవారం తెల్లవారుజామున జరిపిన దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 300 మంది హతమయ్యారు. కాగా పాక్ ప్రభుత్వం దీనిని ఖండించింది. భారత్‌ దాడులపై తాము తగిన సమయం, సరైన చోటు చూసుకుని సమాధానమిస్తామని పేర్కొంది. ఈ దాడుల విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తనున్నట్లు తెలిపింది. భారత్ బాలాకోట్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) అత్యవసరంగా సమావేశమైంది. "భారత్‌ అనవసరంగా దురాక్రమణకు పాల్పడింది. బాలాకోట్‌ సమీపంలో ఉగ్ర శిబిరాలు ఉన్నాయంటూ భారత్‌ జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం మరోసారి సొంత డబ్బా కొట్టుకుంటోంది. భారత్‌లో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడింది" అని వెల్లడించింది. అలాగే, "భారత యుద్ధ విమానాలు పాక్‌ భూభాగంలోకి మూడు నాలుగు కిలోమీటర్లలోకే వచ్చాయి" అని చెప్పింది.

ఈ దాడుల నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం బుధవారం 11 గంటలకు పార్లమెంట్‌ ఉభయ సభలు సమావేశం కావాలని నిర్ణయించింది. పాక్‌ అణ్వాయుధ కార్యక్రమాలను పర్యవేక్షించే నేషనల్‌ కమాండ్‌ అథారిటీ(ఎన్‌సీఏ) తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయించారు. భారత దాడులకు సంబంధించి త్రిసభ్య కమిటీ నియమించామని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. తాజా పరిస్థితిపై దేశ ప్రజలతోపాటు ఇతర పార్టీల సూచనలను తీసుకుని ముందుకెళ్లేందుకు కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. "భారత విమానాలు చేసిన దాడులను పాక్‌ యుద్ధ విమానాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. కొద్ది నిమిషాల్లోనే భారత విమానాలు వెనుదిరిగాయి" అని అన్నారు.