సునామీ పుకార్లతో ఇండోనేసియాలో కలకలం..!

SMTV Desk 2018-12-25 19:24:30  Sunami, Indonesia

జకర్తా, డిసెంబర్ 25: ఇండోనేసియాలో సునామీ సృష్టించిన బీభత్సంకి అక్కడి ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. మరల సునామీ వస్తోందని చెలరేగిన పుకార్లతో ఇండోనేసియాలోని సుమర్‌ గ్రామంలోని ప్రజలు పరుగులు తీశారు. ఇప్పటికే సునామీ కలిగించిన భయాందోళనతో ఉన్న ప్రజలు.. ఈ పుకార్లు రావడంతో ఉన్నపళంగా బతుకు జీవుడా అంటూ ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని పరుగులు పెట్టారు. సమీపంలోని ఎత్తైన ప్రాంతాలకు చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న విపత్తు నిర్వహణ సిబ్బంది సహా వందలాది ప్రజలు ఇళ్లు వదిలి వీధుల వెంబడి పరుగులు పెట్టారు. సుమారు అర్ధ గంట తర్వాత అదంతా తప్పుడు సమాచారం అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇండోనేషియాలో ప్రకృతి ప్రకోపం తీరని శోకాన్ని మిగిల్చింది. శనివారం రాత్రి సునామీ బీభత్సానికి ఇప్పటివరకు 429 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా 128 మంది గల్లంతైనట్లు అక్కడి విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సునామీ కారణంగా సుమత్రా, జావా తీర ప్రాంతాలు మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.