‌ట్రంప్-కిమ్ భేటిపై ఉత్తరకొరియా మీడియా హర్షం..

SMTV Desk 2018-06-13 14:18:37  trump-kim, #trump-kim summit, north korea, america president

సింగపూర్‌, జూన్ 13 : ఎన్నాళ్లో వైరం ఎట్టకేలకు శాంతి చర్చలతో ముగిసింది. మాటల యుద్ధంతో ఉప్పు-నిప్పులా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ మంగళవారం సింగపూర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి కొరియా ద్వీపం నిరాయుధీకరణవైపు సాగడమన్నది అమెరికా ఉత్తర కొరియా మధ్య వైరం రూపుమాపడంపై ఆధారపడి ఉంటుందని ఉత్తరకొరియా జాతీయ మీడియా పేర్కొంది. పరస్పర విశ్వాసంతో ఇరుదేశాలు ముందుకు సాగడం ద్వారా శాంతి, సుస్థిరత సాధిస్తాయని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ తెలిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఎప్పటికీ బద్ద శత్రువుల్లా మిగిలిపోతాయనుకున్న ఇరుదేశాలు కిమ్‌, ట్రంప్‌ చారిత్రక భేటీతో మొత్తం వాతావరణాన్ని మార్చివేశారని కొనియాడింది. చర్చల తరుణంలో సమయం చూసుకుని ఉత్తరకొరియాకు రావాల్సిందిగా ట్రంప్‌ను కిమ్‌ ఆహ్వానించగా.. ట్రంప్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు కొరియా మీడియా పేర్కొంది. కిమ్‌ కూడా అమెరికా రావాలన్న ట్రంప్‌ ఆహ్వానాన్ని సమ్మతించారని తెలిపింది.